Mansoor Ali Khan: చిరంజీవిపై పరువునష్టం దావా వేసిన మన్సూర్ అలీఖాన్ కు కోర్టు మొట్టికాయలు
- త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్
- త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, ఖుష్బూ
- చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ అలీఖాన్ పరువునష్టం కేసు
- మన్సూర్ అలీఖాన్ కు ఇలాంటి వివాదాలు బాగా అలవాటయ్యాయన్న జడ్జి
- త్రిషనే నీపై కేసు పెట్టాలంటూ వ్యాఖ్యలు
ఇటీవల నటి త్రిషపై వ్యాఖ్యలు చేయడం ద్వారా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ మీడియా దృష్టిని ఆకర్షించారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఈ సీన్ లేకుండానే చిత్రీకరణ జరిపారని మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యానించినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
త్రిషతో రేప్ సీన్ మిస్సయిపోయిందంటూ ఆయన విపరీతంగా బాధపడిపోయినట్టు ప్రచారం జరిగింది. దాంతో, మన్సూర్ అలీఖాన్ పై మెగాస్టార్ చిరంజీవి, ఖుష్బూ వంటి ప్రముఖులు మండిపడ్డారు. త్రిషకు వారు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో, తానెలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, తనను అనవసరంగా దూషించారంటూ చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై మన్సూర్ అలీ ఖాన్ మద్రాస్ హైకోర్టులో పరువునష్టం కేసు వేశారు.
అయితే, విచారణ సందర్భంగా సీన్ రివర్సయింది. సదరు తమిళ నటుడికి కోర్టు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు వ్యాఖ్యానించింది.
"మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటైపోయింది... ప్రతిసారి వివాదం రేకెత్తించడం, ఆ తర్వాత నేను అమాయకుడ్ని అనడం మీకు పరిపాటిగా మారింది..." అంటూ న్యాయస్థానం మన్సూర్ అలీఖాన్ ను తప్పుబట్టింది. సమాజంలో ఎలా మెలగాలో నేర్చుకోవాలని న్యాయమూర్తి హితవు పలికారు.
ఈ సందర్భంగా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యల వీడియో (ఎడిట్ చేయని)ను సమర్పించాలని మన్సూర్ అలీ ఖాన్ తరపు న్యాయవాదికి స్పష్టం చేశారు. అన్ కట్ వీడియో సమర్పించేందుకు తాము సిద్ధమేనని మన్సూర్ అలీ ఖాన్ తరఫు న్యాయవాది అంగీకరించారు. అంతేకాదు, మన్సూర్ అలీ ఖాన్ పై త్రిష సోషల్ మీడియాలో చేసిన పోస్టును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ క్రమంలో న్యాయమూర్తి స్పందిస్తూ... త్రిష, ఖుష్బూ, చిరంజీవి కూడా ఈ కేసులో తమ వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబరు 22కి వాయిదా వేశారు.