Zareen Khan: బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు మధ్యంతర బెయిల్
- చీటింగ్ కేసులో డిసెంబర్ 26 వరకు ఉపశమనం
- పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని షరతు
- 2018లో దుర్గామాత పూజ కార్యక్రమంలో పాల్గొంటానంటూ డబ్బు తీసుకొని హాజరుకాని నటి
- చీటింగ్ కేసు పెట్టిన నిర్వాహకులు
దుర్గామాత పూజలో పాల్గొంటానంటూ రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని ఆ తర్వాత మొహం చాటేసిన బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు కాస్త ఉపశమనం లభించింది. 2018 నాటి ఈ చీటింగ్ కేసులో ఆమెకు మధ్యంతర బెయిల్ లభించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదనే షరతును విధిస్తూ కోల్‌కతాలోని సిటీ కోర్టు ఆమెకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఖాన్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత రూ.30,000 వ్యక్తిగత బాండ్‌పై డిసెంబర్ 26 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని, కోల్‌కతా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలులేదని కోర్టు ఆంక్షలు విధించింది. జరీన్ ఖాన్ కోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.
2018లో నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో జరీన్ ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. కోల్‌కతాలో జరిగిన ఒక దుర్గా పూజ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు నటి దాదాపు రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. కానీ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. ఆగ్రహానికి గురైన నిర్వాహకులు జరీన్‌తోపాటు ఆమె మేనేజర్‌పై నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు పెట్టారు. ఇదే కేసులో జరీన్ ఖాన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. సెప్టెంబర్ నెలలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.