AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి
- ఇందుకోసం తనవంతు కృషి చేస్తానంటూ వ్యాఖ్య
- ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతానని చెప్పారు. పొరుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో తనవంతు కృషి చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పలు హామీలు ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈమేరకు మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనిని అన్నారు. ఢిల్లీలో త్వరలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ కు వెళ్లాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) చైర్మన్ ను కలవనున్నట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో 340 కిలోమీటర్ల మేర హైవేను ఆరు లైన్లుగా అభివృద్ధి చేయాలని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.