Garlic Price: కొండెక్కిన వెల్లుల్లి ధర.. కిలో రూ.400 పైకి..!
- ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వెల్లుల్లి పంట
- కొత్త పంట రావడానికి మరింత సమయం
- దీంతో రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారుల వెల్లడి
దేశంలో ఇటీవలి వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరగా.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు కూడా కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 పైనే ఉంది. వంటల్లో నిత్యం వాడే ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట మార్కెట్ కు చేరడానికి బాగా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, పూణే ప్రాంతాలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉల్లి, వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోయింది. దీంతో వ్యాపారులు ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ల నుంచి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటున్నారు. మరో మూడు నెలల దాకా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.