Bomb Threat: కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు
- గతరాత్రి ఎన్ఐఏ కార్యాలయానికి ఆగంతుకుడి ఫోన్ కాల్
- రాజ్ భవన్ లో బాంబు పెట్టామని వెల్లడి
- పోలీసులకు సమాచారం అందించిన ఎన్ఐఏ వర్గాలు
బెంగళూరులోని కర్ణాటక గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ కు గత అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. రాజ్ భవన్ లో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఎన్ఐఏ కార్యాలయానికి ఫోన్ చేశాడు. ఆ బాంబు ఏ క్షణమైనా పేలొచ్చని హెచ్చరించాడు. వెంటనే స్పందించిన ఎన్ఐఏ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.
ఈ నేపథ్యంలో, పోలీసులు రాజ్ భవన్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చేశారు.
అయితే బెదిరింపు కాల్ చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కాల్ బీదర్ నుంచి వచ్చినట్టు తెలుసుకున్నారు. ఆ బెదిరింపు కాల్ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసినట్టు గుర్తించారు. కర్ణాటక గవర్నర్ తావర్ చందర్ గెహ్లాట్ ప్రస్తుతం బెళగావిలో ఉన్నారు.
ఇటీవల, డిసెంబరు 1న బెంగళూరులోని 47 పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.