tspsc: సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడగ్గానే తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారు: బల్మూరి వెంకట్
- టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకేజీలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారన్న బల్మూరి వెంకట్
- అందుకే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేశారని విమర్శలు
- టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని మాట ఇచ్చారని వెల్లడి
టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకేజీలపై నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగారని, దీంతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి రాజీనామా చేశారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిరుద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు పేపర్ లీకవుతున్నాయని మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని మాట ఇచ్చారని, దానిని నిలబెట్టుకుంటారన్నారు.
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు భరోసాని ఇస్తుందని చెప్పారు. టీఎస్పీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి కలిపించిన భరోసాకి విద్యార్థుల తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న భర్తీలను నిరుద్యోగులతో భర్తీ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భావిస్తున్నామన్నారు. నిరుద్యోగులకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్ఎస్‌యూఐ పని చేస్తుందని వెల్లడించారు. సీఎం సమక్షంలో టీఎస్పీఎస్సీ నిరుద్యోగులకు న్యాయంచేసే దిశగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.