Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం మనకంటే బాగా చేయాలని కోరుకుందాం!: హరీశ్ రావు
- అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్టైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారన్న హరీశ్ రావు
- పార్టీ పెట్టినప్పుడూ ఎన్నో ఇబ్బందులు పడ్డామని మాజీ మంత్రి వ్యాఖ్య
- పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామన్న హరీశ్ రావు
- కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదామని పిలుపు
అధికార పార్టీ వాళ్లు మన మానసిక స్టైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడూ ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నో విజయాలు సాధించామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2004లో కాంగ్రెస్ మనతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని, తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ ఇతరులకు ఉండదని వ్యాఖ్యానించారు.
పద్నాలుగేళ్లు కష్టపడి, పదవులు గడ్డి పోచల్లా వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామన్నారు. ఓడినందుకు కుంగిపోవద్దని... వచ్చే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపిద్దామన్నారు. రాష్ట్రమంతా కొంత ఇబ్బంది ఉన్నా సంగారెడ్డిలో ఈసారి గులాబీ జెండా ఎగిరిందని కార్యకర్తలకు కితాబునిచ్చారు. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా కష్టపడి పని చేశారని ప్రశంసించారు.
అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పొంగిపోలేదని, లేనప్పుడు కుంగిపోదని అన్నారు. బీఆర్‌ఎస్ అధికారపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన్నే ఉంటామన్నారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారని, మనకంటే బాగా పని చేయాలని కోరుకుందామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికి భవిష్యత్తు ఉంటుందని, ఆ అవకాశం మనకు ఉందన్నారు. కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరం కలసి పని చేద్దామన్నారు. ఓటమిపై సమీక్ష జరుపుకుందామని, తప్పొప్పులు సరిచేసుకొని ప్రజల పక్షాన నిలబడుదామన్నారు.