TJP: ఒక్కరోజులో 25 మంది సైనికుల బలి... పాక్ సైన్యానికి సవాలుగా మారిన కొత్త తీవ్రవాద సంస్థ
- ఈ ఏడాది ఫిబ్రవరిలో పురుడు పోసుకున్న 'టీజేపీ'
- ఇప్పటివరకు 12 భయానక ఉగ్రదాడులు
- నేడు పాక్ లో మూడు చోట్ల దాడులు
- మూడు దాడులకు తమదే బాధ్యత అని ప్రకటించుకున్న టీజేపీ
ఉగ్రవాద మూకలకు చిరునామాగా నిలిచే పాకిస్థాన్ లో కొత్త టెర్రరిస్టు గ్రూపు పురుడుపోసుకుంది. ఈ సంస్థ పేరు తెహ్రీకే జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ). ఇప్పుడీ కొత్త తీవ్రవాద సంస్థ పాక్ సైన్యానికి సవాలుగా మారింది.
ఇవాళ ఒక్కరోజే 25 మంది పాక్ సైనికులు హతం కాగా, వారందరినీ తామే మట్టుబెట్టినట్టు టీజేపీ ప్రకటించుకుంది. పాక్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో నేడు మూడు వేర్వేరు ఘటనల్లో పాతిక మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలకు తమదే బాధ్యత అని టీజేపీ పేర్కొంది. ఈ ఏడాది ఒక్కరోజులో ఇంతమంది సైనికులు ఉగ్రవాద దాడుల్లో మరణించడం ఇదే ప్రథమం.
టీజేపీ... తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కి అనుబంధ సంస్థ. ఈ నయా ముష్కర మూక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పడింది. ఇప్పటికే పాక్ లో డజను వరకు భయానక ఉగ్రదాడులకు పాల్పడింది. విశృంఖల నరమేధం సాగిస్తూ 50 మంది వరకు సైనికులను పొట్టనబెట్టుకుంది.
టీజేపీ కేవలం సైనిక వర్గాలనే లక్ష్యంగా చేసుకుంటూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతోంది. తెహ్రీకే తాలిబన్ సంస్థ దాడులు చేస్తే పౌరులు కూడా మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే, తెహ్రీకే జిహాద్ సంస్థ మాత్రం సాధారణ పౌరుల జోలికి వెళ్లకుండా, సైన్యాన్నే టార్గెట్ చేస్తోంది.
సాయుధ జిహాద్ ద్వారా పాకిస్థాన్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఈ ఉగ్రవాద సంస్థ చెబుతోంది.