Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ వస్తున్న విమర్శలపై విజయశాంతి స్పందన
- కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కేసీఆర్ను పరామర్శించడంపై కూడా విమర్శలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్య
- మానవీయ స్పందనను రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపాటు
- బీఆర్ఎస్ నేతల విమర్శలను కేసీఆర్ ఖండించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేత
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పరామర్శించిన నేపథ్యంలో ఈ తరహా విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఓదార్పు ఇచ్చారని, దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్ఎస్కు అవసరమేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రకటనలను కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల కన్నా మించి ఉండదని అంటున్నారని, వీటిని కేసీఆర్ ఖండించాలని పేర్కొన్నారు. ‘‘మీరు, మీ పాలన మాత్రమే తెలంగాణ అన్న ధోరణి విడిచి, తెలంగాణలో ప్రజాస్వామ్యం పదికాలాలు మంచిగుండాలని అభిప్రాయపడే విధానం మీకు ఉన్నట్లయితే... కేసీఆర్ స్పందించాలి" అని ఆమె అన్నారు.