Fusa Tatsumi: ఇష్టమైన ఆహారం తిని మరణించిన 116 ఏళ్ల బామ్మ
- ప్రపంచంలో జీవించి ఉన్న రెండో అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకెక్కిన ఫుసా టట్సుమి
- 116 సంవత్సరాలు బతికిన ప్రపంచంలోని ఏడో మహిళగా రికార్డు
- తనకు ఇష్టమైన బీన్ పేస్ట్ జెల్లీ తిన్న అనంతరం కన్నుమూత
ప్రపంచంలో జీవించి ఉన్న రెండవ అత్యంత వృద్ధ మహిళగా రికార్డులకెక్కిన జపాన్‌కు చెందిన 116 ఏళ్ల బామ్మ మృతి చెందింది. కషివరాకు చెందిన ఫుసా టట్సుమి నిన్న తనకు అత్యంత ఇష్టమైన ఆహారమైన బీన్ పేస్ట్ జెల్లీని తిన్న అనంతరం కన్నుమూసింది. ఒసాకాలోని హెల్త్‌కేర్ ఫెసిలిటీలో ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
టట్సుమి తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూడడంతోపాటు ఎన్నో మహమ్మారులను కళ్లారా చూశారు. 119 ఏళ్ల వయసులో మృతి చెందిన కానే టనాక తర్వాత జపాన్‌కు చెందిన రెండో అత్యంత వృద్ధ మహిళగా గిన్సిస్ రికార్డులకెక్కారు. అంతేకాదు, 116 సంవత్సరాలు బతికిన 27వ మహిళగా, ఏడో జపాన్ మహిళగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. 1907లో జన్మించిన టట్సుమికి ముగ్గురు సంతానం. ఆమె భర్త రైతు.