KTR: స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ నామినేషన్... ఆయన పేరును ప్రతిపాదిస్తూ కేటీఆర్ సంతకం
- స్పీకర్ పదవి నామినేషన్‌కు కేటీఆర్‌ను ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, కేటీఆర్, మల్లుభట్టి, కూనంనేని
- రేపు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ
శాసన సభ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సభాపతి నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి... కేటీఆర్‌తో భేటీ అయిన శ్రీధర్ బాబు నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ కేటీఆర్ సంతకం చేశారు.
కాగా స్పీకర్ పదవికి బుధవారం ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చునని ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. బీఆర్ఎస్ మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు అంటే 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు పద్నాలుగువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.