Mallu Bhatti Vikramarka: డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ కేటాయింపు
- ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన కొత్త ప్రభుత్వం
- ఇక మల్లు భట్టి అధికారిక నివాసం
- ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఎంసీఆర్‌హెచ్ఆర్డీ పరిశీలన
ప్రజాభవన్... ఇక నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ఉండనుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఇదే భవనంలో ప్రభుత్వం ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తోంది. ఇది ప్రజా భవన్‌గా మారిన తర్వాత చాలాకాలంగా ఇక్కడ ఉన్న ఇనుప కంచెను తొలగించారు. ఇప్పుడు ఈ భవనాన్ని మల్లు భట్టికి అధికారిక నివాసంగా కేటాయించారు.
మరోవైపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంసీఆర్‌హెచ్ఆర్డీ భవనం సువిశాల స్థలంలో ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటంతో పాటు భద్రతాపరంగా అనుకూలంగా ఉంది. వాహనాల పార్కింగ్‌కూ అనుకూలంగా ఉంది. దీంతో ఇక్కడే ఉండాలని చాలామంది సీఎం రేవంత్ రెడ్డికి సూచించారని చెబుతున్నారు.