Ponguleti Srinivas Reddy: మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి.. తొలి సంతకం దేనిపై పెట్టారంటే..!
- సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించిన పొంగులేటి
- హాజరైన కుటుంబ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు
- రాయగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ తొలి సంతకం
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య తన సీటులో కూర్చున్నారు. బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పొంగులేటి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేలు కూనంనేని, కోరం కనకయ్య, వీరేశం, యశస్వినీ రెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్ లతో పాటు రేణుకా చౌదరి, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిగా భువనగిరి జిల్లా రాయగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ పొంగులేటి తొలి సంతకం చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించడానికి యువజన, క్రీడల శాఖకు స్థలాన్ని కేటాయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపీఆర్వోలకు అధునాతన కెమెరాలను అందించే సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఫైల్ పై మరో సంతకం చేశారు. గృహనిర్మాణ శాఖకు చెందిన పాలనాపరమైన పలు ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు.