Raja Singh: ఆరు గ్యారెంటీలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా?: సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ సూటి ప్రశ్న
- ప్రమాణం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రాజాసింగ్
- ఇటలీ నుంచి తెస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి తెస్తారా? అని ఎద్దేవా
- గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంతో తమ యుద్ధం మొదలైందని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇటలీ నుంచి తెస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి తెస్తారా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంతో తమ యుద్ధం మొదలైందన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఒకటేనని విమర్శించారు.
అక్బరుద్దీన్ ఒవైసీ ముందు తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణం చేసేది లేదని, ఆ మాటకు కట్టుబడి పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాక ప్రమాణం చేసినట్లు తెలిపారు. బీజేపీ నుంచి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మంచివ్యక్తికే బాధ్యతలు అప్పగిస్తుందని, ఫ్లోర్ లీడర్ ఎవరైనా ఎనిమిది మంది ఎమ్మెల్యేలం కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదని, ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.