ayyappa: అయ్యప్పస్వామి భక్తుల సమస్యలపై త్వరలో రేవంత్ రెడ్డిని కలుస్తాం: అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ
- స్వాములు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి
- కేరళ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన
- రెండు తెలుగు రాష్ట్రాలు తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్న స్వాములు
తమ సమస్యలపై దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు విజ్ఞప్తి చేస్తున్నారు. అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ తెలుగు గురుస్వాముల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు గురుస్వాములు మాట్లాడుతూ... అయ్యప్ప దర్శనానికి శబరిమలై వెళ్తున్న తెలుగు రాష్ట్రాల స్వాములు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అయ్యప్ప దర్శనానికి లక్షలాదిగా వెళుతున్న భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ అధికారులు తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారన్నారు.
భక్తి శ్రద్ధలతో శబరిమలకు వెళుతున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు తక్షణమే స్పందించి భక్తులు క్షేమంగా స్వామిని దర్శించుకుని ఇంటికి చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసన తెలుపుతామన్నారు.