Jeevan Reddy: లోక్ సభ ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది: జీవన్ రెడ్డి వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి సీఎం అయిన కొన్నిరోజులకే విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్న జీవన్ రెడ్డి
- మద్యాన్ని గత ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుందని విమర్శ
- ఆడబిడ్డకు కల్యాణ లక్ష్మితో తులం బంగారం సాధ్యమేనని వ్యాఖ్య
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి సీఎం అయిన కొన్నిరోజులకే విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ కొనసాగింపు.. ఉచిత బస్సు ప్రయాణంతో ఎంతోమంది మహిళలకు లబ్ధి చేకూరుతోందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నియంతృత్వ ధోరణి కనిపించిందని, ఉద్యమ లక్ష్యాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని గుర్తు చేశారు.
ఎక్సైజ్ శాఖ గత ప్రభుత్వానికి ఆదాయమార్గంగా మారిందని, మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుందని ధ్వజమెత్తారు. బెల్ట్ షాపుల మూసివేతకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. సీఎం రేవంత్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్‌లో వణుకు కనిపిస్తోందన్నారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమేనని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారన్నారు. ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం సాధ్యమే అన్నారు. హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలపడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్‌లో కలపాలనే డిమాండ్ పరిష్కారమవుతుందన్నారు.