T10 League: ఐపీఎల్ లాంటిదే... మరో టోర్నీకి బీసీసీఐ సన్నాహాలు!
- ప్రపంచవ్యాప్తంగా టీ10 క్రికెట్ కు క్రేజ్
- ఈ దిశగా దృష్టి సారించిన బీసీసీఐ
- జై షా ప్రతిపాదనకు వివిధ వర్గాల మద్దతు
- సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో కొత్త లీగ్ నిర్వహించే అవకాశం
పదిహేనేళ్ల కిందట ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి బంగారు గుడ్లు పెట్టే బాతులా మారింది. ఐపీఎల్ పుణ్యమా అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం కళ్లజూస్తోంది. ఇప్పుడు ఐపీఎల్ తరహాలోనే మరో లీగ్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది.
అయితే ఇది టీ10 లీగ్. బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రతిపాదనకు ఇప్పటికే వివిధ వర్గాల నుంచి మద్దతు లభించినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ టీ10 లీగ్ ను వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే ప్రపంచంలో పలు చోట్ల టీ10 లీగ్ లు జరుగుతున్నాయి. అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఈ లీగ్ లలో పాల్గొంటుండడంతో బీసీసీఐ ఈ దిశగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.