Kaleshwaram Project: మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదన్న ఎల్ అండ్ టీ

L and T rules out taking up Medigadda barrage restoration costs

  • బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వాహణ గడువు మిగిలే ఉందన్న ప్రాజెక్టు ఇంజినీర్లు
  • పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థదేనంటూ గతంలో ప్రకటన
  • ఇందుకు విరుద్ధంగా ఎల్ అండ్ టీ స్పందన
  • పునరుద్ధరణకు ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళతామంటూ లేఖ

మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని ఎల్ అండ్ టీ పేర్కొంది. పునరుద్ధరణకు అయ్యే ఖర్చును చెల్లించేందుకు అనుబంధ ఒప్పందం కుదుర్చుకుంటేనే ముందుకెళతామని తెలిపింది. అయితే, బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా మిగిలే ఉందని, కాబట్టి ప్రాజెక్టు పునరుద్ధరణకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు గతంలో ప్రకటించారు. ఇందుకు భిన్నంగా ఎల్ అండ్ టీ లేఖ రాయడంతో తదుపరి చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఇంజినీర్ ఇన్ చీఫ్ కింది స్థాయి ఇంజినీర్లకు ఆ లేఖను పంపడం చర్చనీయాంశమైంది. 

బ్యారేజీ కుంగిన చోట పియర్స్, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మించాలి. దీనికి రూ.55.75 కోట్లు ఖర్చవుతందని, ఆ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్ ఎండ్ టీ ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ (రామగుండం) వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. ఈ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్ఈఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు. మరోవైపు, దెబ్బతిన్న బ్లాక్‌ను, పియర్స్‌ను పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్ల వరకూ ఖర్చు కావొచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.

  • Loading...

More Telugu News