Stray dog: వీధి కుక్క దాడిలో మూడేళ్ల పాపకు తీవ్ర గాయాలు

Stray dogs Attacked On Kids In Hyderabad

  • మెడను నోట కరిచి చిన్నారిని లాక్కెళ్లిన కుక్క
  • తల్లి కేకలు వేయడంతో పాపను వదిలి పరుగు
  • హైదరాబాద్ లోని నిజాంపేటలో దారుణం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప

హైదరాబాద్ లో మూడేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. పార్కులో ఆడుకుంటున్న పాప మెడను నోట కరిచి లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. తల్లితో పాటు అక్కడున్న జనం కేకలు వేయడంతో భయపడి వదిలిపెట్టింది. నిజాంపేటలోని బండారి లే- అవుట్ లో శుక్రవారం సాయంత్రం ఈ ఘోరం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. నిజాంపేట బండారి లే అవుట్ లోని అఫిక్స్ అపార్ట్ మెంట్ లో శ్రీకాంత్ నాగసాయి దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాగసాయి తన కూతురు సోమశ్రీ (3) ని దగ్గర్లోని పార్కుకు తీసుకెళ్లారు. సోమశ్రీ ఆడుకుంటుంటే దగ్గర్లోనే నాగసాయి కూర్చున్నారు.

ఇంతలో ఓ కుక్క తన పిల్లలతో వచ్చి సోమశ్రీ మెడను కరిచి లాక్కెళ్లసాగింది. దీంతో భయాందోళనకు లోనైన నాగసాయి కేకలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్లు అదిలించడంతో భయపడిన కుక్క.. సోమశ్రీని వదిలేసి పారిపోయింది. తీవ్ర గాయాలపాలైన సోమశ్రీని చుట్టుపక్కల వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోమశ్రీ చికిత్స పొందుతోంది. కాగా, అదే కుక్క అక్కడికి దగ్గర్లోని సాత్విక్ హోం అపార్ట్ మెంట్ వద్ద శ్యామల అనే ఆరేళ్ల పాపపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అక్కడున్న వారు కొట్టడంతో పారిపోయింది. అయితే, శ్యామలకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు చెప్పారు.

దిల్ సుఖ్ నగర్ లో ఆరేళ్ల బాలుడిపై..
శాంతినగర్ రాఘవేంద్ర నిలయం అపార్ట్ మెంట్ వద్ద ఆరేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. ట్యూషన్ నుంచి స్నేహితులతో కలిసి ఇంటికి వెళుతున్న విశ్వ (6) ను వెంటపడి కరిచింది. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తున్న బద్రినాథ్ కుమారుడు విశ్వ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. గురువారం రాత్రి ట్యూషన్ వెళ్లి వస్తుండగా కుక్క వెంటపడింది. సెల్లార్ లోపలికి వచ్చి మరీ కరిచింది. చిన్నారుల కేకలు విని బద్రినాథ్‌ వచ్చి కొట్టడంతో కుక్క పారిపోయింది. ఈ ఘటనలో విశ్వకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు బద్రినాథ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News