alleti maheshwar reddy: రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు.. ఓ చోట ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారు: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి
- అప్పులు చూపించి హామీలు అమలు చేయకుండా తప్పించుకోవద్దని సూచన
- ప్రజావాణి రోజూ ఉంటుందని చెప్పి ఇప్పుడు వారానికి రెండు రోజులు అంటున్నారని విమర్శ
- ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డి ఐపీఎస్ కాదు... సీనియర్ మంత్రులు కానిస్టేబుళ్లు కాదని ఎద్దేవా
తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులను చూపించి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఇప్పటికే ప్రజావాణి ప్రతిరోజు ఉంటుందని చెప్పారని, కానీ ఇప్పుడు వారంలో రెండు రోజులే అంటున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ హామీలనే చదివించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 412 హామీలను ఇచ్చిందని, కానీ ఇప్పుడు కేవలం 6 గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు? అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలపలేదని, కేవలం మేజిక్ ఫిగర్‌కు దగ్గరి సీట్లతోనే గెలిపించారన్నారు.
రైతుబంధు రూ.15వేలు ఇస్తామని చెప్పారని, దానిని ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని నిలదీశారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని, బీజేపీ కూడా తెలంగాణకు మద్దతు పలికిందనే విషయం మరిచిపోవద్దన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, కామారెడ్డి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఓడిపోయిన సందర్భాలు లేవన్నారు. సీనియర్ మంత్రులందరి సలహాలు తీసుకొని రేవంత్ రెడ్డి ముందుకు సాగాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఐపీఎస్ కాదు... సీనియర్ మంత్రులు అందరూ కానిస్టేబుల్స్ కాదని చురకలు అంటించారు. గతంలోని దూకుడు తగ్గించుకొని రాష్ట్రాన్ని కాపాడుతారని భావిస్తున్నట్లు తెలిపారు.