Atchannaidu: యువగళం ముగింపు సభకు పవన్ కల్యాణ్ రావడంలేదు: అచ్చెన్నాయుడు
- ఈ నెల 18తో ముగియనున్న లోకేశ్ పాదయాత్ర
- డిసెంబరు 20న పోలేపల్లి వద్ద విజయోత్సవ సభ
- తొలుత చంద్రబాబుతో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం
- ఉమ్మడి మేనిఫెస్తో ఇంకా సిద్ధం కాలేదన్న అచ్చెన్నాయుడు
- అందుకే పవన్ రావడంలేదని వివరణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో, భోగాపురం మండలం పోలేపల్లి వద్ద డిసెంబరు 20న యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది.
ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని తొలుత ప్రకటించారు. అయితే, యువగళం విజయోత్సవ సభకు పవన్ కల్యాణ్ రావడంలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధంకాలేదని, అందుకునే పవన్ ఈ సభకు హాజరుకావడంలేదని వివరించారు.
ఈ సభకు చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ అగ్రనేతలు మాత్రమే హాజరవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాక చంద్రబాబు, పవన్ లతో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.
కాగా, పోలేపల్లిలో యువగళం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 6 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామని, ఈ సభ నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు.