CPI Narayana: జగనన్న భూ రక్ష పుస్తకం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు: సీపీఐ నారాయణ

CPI Narayana comments on Jagananna Bhu Raksha scheme

  • సొంతూరికి వెళ్లిన సీపీఐ నారాయణ
  • పొలాల్లో జగనన్న భూ రక్ష రాళ్ల పరిశీలన
  • భూ రక్ష పాస్ బుక్కుతో ఎలాంటి ఉపయోగం లేదని వెల్లడి
  • తెలంగాణలో ధరణి కూడా ఇలాంటిదేనని వ్యాఖ్యలు
  • కేసీఆర్ ఓటమికి కారణమైందని వివరణ
  • రేపు ఏపీలో జగన్ ను దెబ్బతీసేది కూడా ఈ భూ హక్కు పథకమేనని స్పష్టీకరణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వైఎస్సార్ జగనన్న భూ రక్ష పథకంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ జగనన్న భూ రక్ష పథకంలో భాగంగా పొలం సొంతదారులకు ఇచ్చే పట్టాదార్ పాస్ బుక్కు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని అన్నారు. 

సీపీఐ నారాయణ చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామం అయినంబాకం విచ్చేశారు. అక్కడ పొలాలను సందర్శించారు. వైఎస్సార్ జగనన్న భూ రక్ష రాయి వద్ద కూర్చుని, పట్టాదార్ పాస్ బుక్ ను ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ జగనన్న భూ రక్ష పుస్తకం ఒట్టి డొల్ల. జగనన్న భూ రక్ష పథకం కింద ఆయన బొమ్మేసి, పుస్తకాలు ప్రింట్ చేసి ఇదే మీ పాస్ పుస్తకం అని ఇస్తున్నారు. ఇది దేనికీ పనికిరాదని వాళ్లే చెబుతున్నారు! బ్యాంకు రుణం తీసుకొను సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేయు సందర్భంలో కానీ, ఈ భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం అధికారికి చూపించనవసరం లేదని ఆ పుస్తకంలోనే పేర్కొన్నారు. అంటే... ఇది బోగస్ పుస్తకం... దేనికీ పనికిరాదు అని అర్థమవుతోంది. ఆయన (సీఎం జగన్) బొమ్మేసి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు" అని నారాయణ విమర్శలు చేశారు. 

ఈ సందర్భంగా నారాయణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పాస్ పుస్తకం, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాస్ పుస్తకాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు ఇచ్చిన పాస్ పుస్తకంలో అన్ని హక్కులు కల్పించారని, అది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందని నారాయణ వెల్లడించారు. కానీ, జగన్ బొమ్మతో ఉన్న పాస్ బుక్ ఎక్కడా చెల్లదని, దానితో బ్యాంకు వాళ్లు రుణాలు ఇవ్వరని, హక్కు పత్రం కూడా లభించదని చెప్పారు. 

అంతేకాకుండా, భూముల రీ సర్వే చేశారని, కానీ పక్కపక్కనే పొలాలకు జాయింట్ పత్రాలు ఇచ్చారని, దాంతో పొలాల సొంతదారుల కొట్టుకుచావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇలా అనేక లోపాలతో భూ రక్ష పథకాన్ని తీసుకువచ్చి, వేల కోట్లు దుబారా చేశారని విమర్శించారు. 

తెలంగాణలో ధరణి పథకం కూడా ఇలాంటిదేనని, ధరణిలో వినియోగదారుల హక్కులు కనిపించలేదని, భూమి అనుభవదారుల హక్కులు కనిపించలేదని, ఆ హక్కులు భూస్వామి ఖాతాలోకి వెళ్లిపోయాయని వివరించారు. కేసీఆర్ ను దెబ్బతీసింది ఈ అంశమేనని నారాయణ అన్నారు. 

ఇప్పుడు జగన్ ను కూడా ఏపీలో ఈ భూ రక్ష పథకమే దెబ్బతీయబోతోందని స్పష్టం చేశారు. భూ రక్ష వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు లేకపోగా, అనేక వివాదాలు వచ్చే అవకాశం ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News