Decoding The Leader: చంద్రబాబు ప్రస్థానంపై 'డీకోడింగ్ ద లీడర్' పుస్తకం... హైదరాబాదులో ఆవిష్కరణ
- చంద్రబాబుపై పుస్తకం రాసిన డాక్టర్ పెద్ది రామారావు
- పెద్ది రామారావు కుమార్తెల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ
- ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘురామ
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్థానంపై డాక్టర్ పెద్ది రామారావు 'డీకోడింగ్ ద లీడర్' అనే పుస్తకం రాశారు. రచయిత పెద్ది రామారావు... చంద్రబాబుతో ఆరేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబును దగ్గరగా చూసి ఆయన ఆలోచనలను, పనితీరును అవగాహన చేసుకుని ఈ పుస్తకం రాసినట్టు రచయిత తెలిపారు.
కాగా, 'డీకోడింగ్ ద లీడర్' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం హైదరాబాదు శిల్పకళావేదికలో జరిగింది. ఇక్కడి రాక్ హైట్స్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో రచయిత పెద్ది రామారావు కుమార్తెలు ప్రేరణ, రాగలీన చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'డీకోడింగ్ ద లీడర్' పుస్తకం చదివానని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడూ విజన్ తోనే పనిచేస్తారని కొనియాడారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఏమిటో ఈ పుస్తకం చెబుతుందని అన్నారు. చంద్రబాబు ఎంత శ్రమించేవారో ఈ పుస్తకం చెబుతుందని వివరించారు.
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని రఘురామ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పురోగతిని చూసి చంద్రబాబుకు దండం పెట్టానని వెల్లడించారు. సైబరాబాద్ ను చూస్తే చంద్రబాబు కష్టం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో నరేగా పథకం కింద రికార్డు స్థాయిలో రోడ్లు నిర్మించారని రఘురామ తెలిపారు.
మళ్లీ చంద్రబాబు వస్తేనే ఏపీ ప్రజల కష్టాలు తీరతాయని అన్నారు. మళ్లీ చంద్రబాబు వచ్చి గోదావరి జిల్లాలను కలిపే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షించారు. కాగా, ఈ పుస్తకావిష్కరణకు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు.