Rachakonda CP: రూల్స్ పాటించని పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు: రాచకొండ సీపీ సుధీర్ బాబు
- సివిల్ వివాదాల్లో తలదూర్చితే సహించేది లేదని హెచ్చరిక
- ఎస్‌వోపీ రూల్స్ పాటించాలని సూచన
- ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశాలు
రూల్స్ పాటించని పోలీస్ సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. పోలీసులు ఎస్‌వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం మాత్రమే నడుచుకోవాలని, సివిల్ వివాదాల్లో వేలుపెడితే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పీఎస్ పరిధిలో రోజుకు కనీసం 15 నిమిషాల పాటు ప్రజల మధ్య తిరిగి వారి సమస్యలు తెలుసుకోవాలని, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజల సమస్యలు గుర్తించాలని ఆయన సూచించారు.
కమిషనరేట్ పరిధిలో జరిగే నేరాలను సమర్థవంతంగా అరికట్టాలని పోలీసు సిబ్బందిని సుధీర్ బాబు ఆదేశించారు. టెక్నికల్ ఆధారాలు సేకరించాలని, దర్యాప్తు, నేరస్తులను పట్టుకోవడంలో సీసీటీవీ కెమెరాల ఆధారాలను సేకరించాలని సూచించారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో జరిగిన ఈ సమీక్షలో డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.