PM Modi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై మోదీ స్పందన
- చాలా సీరియస్ ఇష్యూ అన్న ప్రధాని
- దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హితవు
- సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడి
పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనను అందరూ ఖండించాలని, దీనిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. బుధవారం లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు యువకులు సభలోకి దూకి, స్మోక్ క్యాన్లతో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. సభలో భద్రతా లోపంపై సీరియస్ గా వ్యవహరించాలని కేబినెట్ మినిస్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.
ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు మోదీ వివరించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సెక్యూరిటీ సిబ్బందికి సూచించామన్నారు. మరోవైపు, పార్లమెంట్ లోపలా బయటా అలజడి సృష్టించిన ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నారు. వీరిలో స్మోక్ అటాక్ సూత్రధారి లలిత్ ఝాను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ సెల్ దర్యాప్తు జరుపుతోంది.