Atchannaidu: అద్దెకు బస్సులు అడిగితే ఆర్టీసీ నుంచి స్పందన లేదు... ఏ వాహనం దొరికితే దాంట్లో వచ్చేయండి: అచ్చెన్నాయుడు
- జనవరి 27 నుంచి కొనసాగుతున్న లోకేశ్ యువగళం
- డిసెంబరు 18తో ముగియనున్న పాదయాత్ర
- డిసెంబరు 20న పోలేపల్లిలో విజయోత్సవ సభ
- సభ ఏర్పాట్లను పరిశీలించిన అచ్చెన్నాయుడు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి చేపట్టిన యువగళం పాదయాత్ర రేపటితో ముగియనుంది. యువగళం విజయోత్సవ సభను ఈ నెల 20న భోగాపురం మండలం పోలేపల్లి వద్ద భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వస్తారని, అందుకోసం అద్దెకు బస్సులు ఇవ్వాలని కోరితే ఆర్టీసీ నుంచి ఇప్పటివరకు స్పందన లేదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, టీడీపీ శ్రేణులు అందుబాటులో ఉన్న ఏ వాహనం దొరికినా, దాంట్లో పోలేపల్లి వచ్చేయాలని సూచించారు. డిసెంబరు 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పోలేపల్లిలో సభ ప్రారంభవుతుందని, పార్టీ నేతలు, కార్యకర్తలు సకాలంలో సభా ప్రాంగణానికి చేరుకోవాలని స్పష్టం చేశారు.
యువగళం ముగింపు సభ ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల పోరాటానికి టీడీపీ-జనసేన సిద్ధమని ఈ సభ ద్వారా సమర శంఖం పూరిస్తామని అన్నారు.