NASA: అంతరిక్షంలో 8 నెలలపాటు టమాటాలు ఉంచితే ఏమవుతుంది?.. ఎలా అయ్యాయో చూడండి..!

NASA Reveals First Image Of Missing Space Tomatoes Found After 8 Months
  • టమాటాలు కొంత రంగు మారిపోయి మెత్తబడ్డాయని వెల్లడించిన నాసా
  • సూక్ష్మజీవులు లేదా శిలీంధ్రాల పెరుగుదల లేదని వెల్లడి
  • 8 నెలల క్రితం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తప్పిపోయిన టమాటాలు దొరకడంతో ఆసక్తికర విషయాల గుర్తింపు
టమాటాలను దాదాపు 8 నెలలపాటు అంతరిక్షంలో ఉంచితే ఏమవుతుంది?.. ఈ దిశగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగం చేపట్టకపోయినప్పటికీ ఒక అనూహ్య పరిణామం కారణంగా కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తించింది. టమాటాలలో నీటి పరిమాణం తగ్గిపోయి కొంత రంగు మారిపోయి మెత్తబడ్డాయని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూక్ష్మజీవులు లేదా శిలీంధ్రాల పెరుగుదల కనిపించలేదని స్పష్టం చేశారు. మట్టి లేని మొక్కల పెంపక ప్రయోగం ‘ఎక్స్‌పోజ్డ్ రూట్ ఆన్-ఆర్బిట్ టెస్ట్ సిస్టమ్’లో భాగంగా అంతరిక్షంలో వ్యోమగామి ఫ్రాంక్ రూబియో రెండు చిన్నచిన్న టమాటాలను తెంపుతున్న సమయంలో అవి చేతుల నుంచి జారి పోయాయి. ఆ తర్వాత కనిపించకుండా పోయాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తిరుగాడిన టమాటాలను ఎట్టకేలకు 8 నెలల తర్వాత ఓ ప్లాస్టిక్ బ్యాగులో గుర్తించారు. 

తొలుత టమాటాలు కనిపించడం లేదని ఫ్రాంక్ రూబియో చెబితే ఆయనే తినేసి ఉంటారని సహచర వ్యోమగాములు సరదాగా పంచులు వేశారని, ఎట్టకేలకు అవి కనిపించాయని, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిబ్బంది ఇటీవలే వాటిని గుర్తించారని నాసా వివరించింది. దీంతో చిన్నపాటి రహస్యానికి ముగింపు పడిందని, రూబియో టమాటాలు తినలేదని నిరూపితమైందని ఈ సందర్భంగా సరదాగా వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నాసా శుక్రవారం యూట్యూబ్ వేదికగా పంచుకుంది. 

కాగా మట్టి లేదా ఇతర వృద్ధి మాధ్యమాలు లేకుండా మొక్కల పెంపకంపై దృష్టి సారించిన నాసా ఎక్స్‌రూట్స్ ప్రయోగాన్ని చేపట్టింది. హైడ్రోపోనిక్, ఏరోపోనిక్ పద్ధతుల ద్వారా మొక్కల పెంపకంపై ప్రయోగాలు చేస్తోంది.  ద్రవ్యరాశి, పారిశుద్ధ్య సమస్యలు, ఇతర అంశాల కారణంగా ప్రస్తుతం అంతరిక్ష వాతావరణంలో మొక్కలు చక్కగా పెరగకపోవచ్చునని, ఎక్స్‌రూట్ ప్రయోగం విజయవంతమైతే మట్టి తక్కువ పద్ధతుల్లో భవిష్యత్తులో మొక్కల విధానాలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా నాసా పేర్కొంది.
NASA
Space
Tomatoes
ISS
XROOTS
Frank Rubio

More Telugu News