Sanjay Manrekar: ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పుపై హార్ధిక్ పాండ్యాకు అనుకూలంగా స్పందించిన మాజీ ఆటగాడు!
- రోహిత్ శర్మ విషయంలో సెంటిమెంటల్‌గా, భావోద్వేగంగా ఆలోచించొద్దన్న సంజయ్ మంజ్రేకర్
- హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా నిరూపించుకున్నాడని సమర్థించిన మాజీ బ్యాటర్
- ఈ పరిణామాలన్నింటినీ ఒత్తిడిగా తీసుకోకూడదని పాండ్యాకు సూచించిన మంజ్రేకర్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాను ప్రకటించడంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పదేళ్లపాటు జట్టుని విజయవంతంగా నడిపించిన హిట్‌మ్యాన్‌ను మార్చడంపై రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్ధిక్ పాండ్యాకు అనుకూలంగా టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ విషయంలో సెంటిమెంటల్‌గా లేదా ఎమోషనల్‌గా ఆలోచించొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని మంజ్రేకర్ అన్నాడు. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా నిరూపించుకున్నాడని, కాబట్టి ఇది మంచి నిర్ణయమేనంటూ ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని సమర్థించాడు. టీ20లలో టీమిండియాకు పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడనే విషయాన్ని మరచిపోకూడదని, ఆటగాళ్ల జడ్జిమెంట్‌లో సెంటిమెంట్లను తీసుకురావొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని అన్నాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డేకు సంబంధించిన చర్చలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హార్ధిక్ పాండ్యా ఫామ్‌లో ఉన్న ఆటగాడని, ఈ పరిణామాలన్నింటినీ అతడు ఒత్తిడిగా భావించకూడదని మంజ్రేకర్ సూచించాడు. ముంబై ఇండియన్స్ ఎంత నమ్మకంతో మద్దతు తెలుపుతుందో గుర్తుంచుకోవాలన్నాడు.
కాగా.. ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ ప్రకటించింది. మూడు రోజులక్రితం చేసిన ఈ ప్రకటన రోహిత్ శర్మ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. కాగా రోహిత్ శర్మ పదికిపైగా ఎడిషన్లలో ముంబై జట్టుకు సారధ్యం వహించాడు. ఏకంగా ఐదు టైటిల్స్ కూడా అందించాడు. ఇక 2015లో ముంబై ఇండియన్స్‌లో హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ కెరియర్ ప్రారంభించాడు. అయితే 2022 మెగా వేలానికి ముందు హార్దిక్‌ను ముంబై విడుదల చేయడంతో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. తొలి ఏడాది 2022లో పాండ్యా టైటిల్ గెలిపించాడు. గతేడాది కూడా టీమ్‌ని ఫైనల్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.