IT Sector: ఐటీరంగంపై ఆర్థికమాంద్యం ప్రభావం.. వేతనాల్లో కోతలు మళ్లీ షురూ
- ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన వేలాదిమంది ఐటీ నిపుణులు
- అంతా సమసిపోయిందనుకున్న వేళ మళ్లీ ఆందోళన
- ప్రమోషన్లు నిలిపివేసి, వార్షిక వేతన పెంపును 10 శాతానికే పరిమితం చేస్తున్న సంస్థలు
- ఆటోమేషన్, ఏఐ ఆక్రమణపై నిపుణుల్లో ఆందోళన
ఐటీ రంగం ఈ ఏడాది తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వేలాదిమంది ఉద్యోగులు కొలువులు కోల్పోయి రోడ్డునపడ్డారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, సేల్స్ఫోర్స్, ట్విట్టర్.. ఇలా ఒకటేమిటి అనేక సంస్థలు ఖర్చు తగ్గింపులో భాగంగా వేలాదిమందిని తొలగించాయి. ఇక, పింక్స్లిప్ల బాధ వదిలిపోయిందనుకుంటున్న వేళ ఐటీరంగంలో మరోమారు కుదుపు కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థికమాంద్యం నేపథ్యంలో బెంగళూరులోని ఐటీ సంస్థలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2007, 2009 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని ప్రముఖ టెక్ కంపెనీ సీనియర్ హెచ్ఆర్ మేనేజర్ ఒకరు తెలిపారు.