Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర హెచ్చరిక
- మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి సచివాలయంలో ప్రతినిధులతో సమావేశం
- ఇంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకంగా, నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారు? అని నిలదీత
- మా తప్పిదం లేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ
- మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
ఎల్ అండ్ టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పనులకు సంబంధించి ఆయన సచివాలయంలో ఎల్ అండ్ టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అతిపెద్ద ప్రాజెక్టులో ఇంత నాసిరకంగా, ఇంత నాణ్యత లేకుండా ఎలా పనులు చేశారని నిలదీశారు.
ఏదో ఒక లేఖను అధికారికి ఇచ్చి మా తప్పిదం లేదంటూ మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వారిని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కుంగుబాటుకు కారణమైన ఎవరినీ తాము వదిలేది లేదని స్పష్టం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలనూ పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు.