Lok Sabha: శీతాకాల సమావేశాలు ముగిసేవరకు లోక్ సభ నుంచి 30 మంది ఎంపీల సస్పెన్షన్
- ఇటీవల లోక్ సభలోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు
- పొగ వదిలి తీవ్ర కలకలం సృష్టించిన వైనం
- ఇది కేంద్రం భద్రతా వైఫల్యం అంటూ విపక్షాల ధ్వజం
- నేడు కూడా దద్దరిల్లిన లోక్ సభ
- సస్పెండైన వారిలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి
ఇటీవల లోక్ సభలోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలి తీవ్ర కలకలం సృష్టించడం తెలిసిందే. అయితే, హై సెక్యూరిటీ ఉండే పార్లమెంటులోకి కొత్త వాళ్లు ఎలా ప్రవేశించారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో ఎంపీల భద్రత ఒట్టి డొల్ల అని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలు లోక్ సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ కూడా భద్రతా వైఫల్యం అంశంపై లోక్ సభ దద్దరిల్లింది. దాంతో, 30 మంది విపక్ష సభ్యులను శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు.
దీనిపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పందించారు. పార్లమెంటులో విపక్షాల పట్ల అణచివేత ధోరణి అవలంబిస్తోందంటూ కేంద్రంపై మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుల నైతిక హక్కులను కాలరాస్తోందని అన్నారు. సభా సమావేశాలను నిర్వహించాలన్న ఉద్దేశం అధికార పక్షానికి ఏమాత్రం లేదన్న విషయం ఇలాంటి చర్యల ద్వారా స్పష్టమవుతోందని గొగోయ్ వివరించారు. కాగా, విపక్షాల ఆందోళనల కారణంగా లోక్ సభ నేడు పూర్తిగా వాయిదా పడింది.