Botcha Satyanarayana: ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి తొలగించి పారిపోయిన ప్రభుత్వం కాదు ఇది: మంత్రి బొత్స
- గత ప్రభుత్వంపై మంత్రి బొత్స ఫైర్
- నిరుద్యోగ భృతి పేరిట మోసం చేశారని విమర్శలు
- కేవలం 34 వేల ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారని వ్యాఖ్యలు
- ఎల్లో మీడియా మాయలో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1.4 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని వెల్లడించారు. ఐదేళ్ల కాలంలో కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం కాదు ఇది... నాలుగున్నరేళ్లలో బాబు కంటే ఏడింతలు మెరుగ్గా 2.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధి చాటుకున్న ప్రభుత్వం ఇది అని వివరించారు.
"నిరుద్యోగులకు రూ.2 వేలు భృతి ఇస్తామని చెప్పి, ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీ కార్యకర్తలకు రూ.1000 ఇచ్చి వంచించిన ప్రభుత్వం కాదు ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి యువతను సమాజ సేవలో భాగం చేసిన ప్రభుత్వం ఇది. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు ప్రపంచ స్థాయి విద్యను చేరువ చేశాం. పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న ప్రభుత్వం ఇదని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.
అంతేకాకుండా... ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది. కరోనా సంక్షోభం సమయంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఎల్లో మీడియా మాయలో పడొద్దని, మోసం చేసే వ్యక్తులను నమ్మొద్దని ప్రజలకు మనవి చేస్తున్నాను" అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్స్ లో పేర్కొన్నారు.