Ponnam Prabhakar: కనీసం బస్సుల సంఖ్యనైనా తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకోండి: మంత్రికి ఆటో సంఘాల విజ్ఞప్తి
- మంత్రిని కలిసిన బీఎంఎస్ అనుబంధ ఆటో సంఘాలు
- ఉపాధిని కాపాడాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆటో యూనియన్ల విజ్ఞప్తి
- మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన చేయాలని విన్నపం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం తమపై ప్రభావం చూపుతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆటో సంఘాల యూనియన్ నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆటో డ్రైవర్లు... మంత్రికి విజ్ఞప్తి చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్, టీఎస్‌పీటీఎంఎం యూనియన్ల ఆధ్వర్యంలో మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకు వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం విషయంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కనీసం బస్సుల సంఖ్యనైనా తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ఓలా, ఉబెర్, ర్యాపిడ్ బైక్‌ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని మంత్రిని కోరారు. యూనియన్ల డిమాండ్లపై స్పందించిన మంత్రి... త్వరలో ఆటో సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.