Jawaharlal Nehru: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నెహ్రూ ఫొటో స్థానంలో అంబేద్కర్ ఫొటో.. కాంగ్రెస్ ఫైర్!
- నెహ్రూ ఫొటోని యథాస్థానంలో పెట్టకుంటే తమ ఎమ్మెల్యేలే ఆ పని చేస్తారని కాంగ్రెస్ హెచ్చరిక
- మహాత్మగాంధీ ఫొటోని యథాతథంగా ఉంచి నెహ్రూ చిత్రపటాన్ని మార్చడంపై భగ్గుమన్న హస్తం పార్టీ నేతలు
- వివాదంతో మొదలైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
మధ్యప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాల తొలి సెషన్లో వివాదం నెలకొంది. సభలో స్పీకర్ కుర్చీ వెనుక మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటం స్థానంలో బీఆర్ అంబేద్కర్ ఫొటోని పెట్టడం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ కుర్చీ వెనుక మరో పక్కనున్న మహాత్మగాంధీ ఫొటోని యథాతథంగా ఉంచి నెహ్రూ చిత్రపటాన్ని మార్చడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. నెహ్రూ ఫొటోని యథా స్థానంలో ఉంచాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ పని పూర్తి చేస్తారని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
సీఎం మోహన్ యాదవ్ సారధ్యంలో మధ్యప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసిన దాదాపు వారం తర్వాత 4 రోజుల శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోపాల్ భార్గవ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.
కాంగ్రెస్ నేత ఉమంగ్ సింగర్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆ పార్టీ ఎన్నుకుందని స్పీకర్ భార్గవ సభకు తెలియజేశారు. ఇక అసెంబ్లీ స్పీకర్ పదవికి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేరును బీజేపీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.