karthik Prasad: నాన్నకి కేన్సర్ అని తెలిశాక ఏం జరిగిందంటే..: 'ఆహుతి' ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్
- ఆయన కేన్సర్ విషయం చాలామందికి తెలియదన్న కార్తీక్
- ఎప్పటిలా ఆయన సినిమాలు చేస్తూ వెళ్లడమే కారణమని వివరణ
- చివరి రోజుల్లో సొంత ఊరుకి వెళ్లాలనుకున్నా వెళ్లలేకపోయారని వెల్లడి
'ఆహుతి' ప్రసాద్ .. తెలుగు తెరపై విలక్షణ నటుడిగా తన మార్క్ చూపించిన నటుడు. సుదీర్ఘకాలం పాటు అనేక చిత్రాలలో నటించిన ఆయన, ఆ తరువాత కాలంలో కేన్సర్ తో చనిపోయారు. ఆయన తనయుడు కార్తీక్ ప్రసాద్ నటుడిగా ఎదుగుతున్నాడు. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ ప్రసాద్ మాట్లాడాడు.
"నాన్న కేన్సర్ తో పోయారు .. ఆయనకి కేన్సర్ వచ్చిన విషయం కూడా చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వేషాలు రావడం కష్టం. కొంతమంది సానుభూతిని చూపించినా, మరికొంతమంది చులకనగా చూస్తారు. అలా చూడటం నాన్నకి ఇష్టం ఉండదు. అందువలన ఆయన తన పనిని తాను అలా చేస్తూనే వెళ్లారు" అని అన్నాడు.
"చివరి రోజుల్లో నాన్న సొంత ఊరుకి వెళ్లాలనుకున్నారు. అక్కడ ఇంటిని కూడా బాగు చేయించాము. అంతలోనే ఆయన పోయారు. అందరితో కలివిడిగా ఉండటం వలన, ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. ఇక నా విషయానికి వస్తే, నేను పైలెట్ గా కొంతకాలం పనిచేశాను. ఆ తరువాతనే సినిమాల దిశగా వచ్చాను. 'టక్ జగదీశ్' .. 'మసూద' వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి" అని చెప్పాడు.