Lok sabha Elections: తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో మోదీ..?
- లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ
- దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్
- ఈసారి మెజారిటీ స్థానాల్లో జెండా ఎగరేయాలని యోచన
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి దక్షిణాదిలో మెజారిటీ ఎంపీ సీట్లను గెల్చుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ నుంచి లోక్ సభ బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తే రాష్ట్రంలో మెజారీటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవచ్చనేదే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. మోదీ స్వయంగా వారణాసిలో పోటీ చేయడంతో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిచింది. తెలంగాణలోనూ ఇదే ఫార్ములా అనుసరించాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఈమేరకు ప్రధాని మోదీకి పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కనీసం 12 సీట్లను గెలుచుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ సీనియర్ నేతలు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. అధికారాన్ని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు రాష్ట్రాలపై పార్టీ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీని తెలంగాణలోని సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.