Nara Lokesh: మంగళగిరిలో నేను చేసిన పొరపాటు అదే: నారా లోకేశ్
- నిన్నటితో ముగిసిన లోకేశ్ యువగళం పాదయాత్ర
- ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన టీడీపీ అగ్రనేత
- ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని స్పష్టీకరణ
- మంగళగిరి మనసులు గెలుచుకున్నానని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిన్నటితో ముగిసింది. రేపు భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
యువగళం ముగిసింది... ఇక మీ తదుపరి కార్యాచరణ ఏమిటి? మీరు మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు... ఇప్పుడు వారందరికీ వివరణ ఇస్తానని లోకేశ్ తెలిపారు.
"నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మా తాత గారు ముఖ్యమంత్రిగా చేశారు, మా నాన్న ముఖ్యమంత్రిగా చేశారు. నేను కూడా వారి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఇక, మంగళగిరి ఒక అద్భుతమైన నియోజకవర్గం. అయితే అక్కడ టీడీపీకి పెద్దగా పట్టులేదు. గతంలో ఒకట్రెండు పర్యాయాలు మాత్రమే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.
నేను నాయకుడిగా నిరూపించుకోవాలంటే మంగళగిరి నియోజకవర్గమే సరైంది అనిపించింది. మంగళగిరిని టీడీపీ కంచుకోటగా చేయడం ద్వారా నాయకుడిగా నా సత్తా ఏంటో చూపించాలనుకున్నాను. కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే... గత ఎన్నికల సమయంలో కేవలం 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాను. దాంతో అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం ముందే మంగళగిరి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రజల సమస్యలు ఏంటో లోకేశ్ కు తెలిసేవి, లోకేశ్ ఏంటో ప్రజలకు తెలిసేది.
కానీ ఓడిపోయిన క్షణం నుంచి మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నాను. పాదయాత్ర సమయంలో తప్పించి అధిక సమయం మంగళగిరి కోసం కేటాయిస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో నా ఫోన్ నెంబరు చాలామందికి తెలుసు. నా ఫోన్ కు చిన్న మెసేజ్ పెట్టినా, మన మంగళగిరి-మన లోకేశ్ అని బ్యాడ్జి పెట్టుకుని నా దగ్గరకు వచ్చినా యుద్ధ ప్రాతిపదికన వాళ్ల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశాను. ఆ విధంగా మంగళగిరి ప్రజల మనసులు గెలుచుకున్నానని నమ్ముతున్నాను.
గతంలో నేను ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయానో, ఈసారి దాని పక్కన ఓ సున్నా చేర్చి, 53 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరి ప్రజలు ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను" అంటూ వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఇతర అంశాల గురించి లోకేశ్ మాట్లాడుతూ... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏకపక్షంగా వ్యవహరించడం మొదలుపెట్టిందని, యువత ఎదుర్కొంటున్న సమస్యలను తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. పీడిత యువత తన వద్దకు వచ్చి... సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తున్నారని, తమ గొంతుక వినిపించేందుకు ఏదైనా వేదిక కావాలని కోరారని వెల్లడించారు.
ఆ విధంగా, యువతకు ఒక వేదిక కావాలన్న ఉద్దేశంతో యువగళం ప్రారంభించామని లోకేశ్ వివరించారు. యువత గళం సర్కారుకు వినిపించాలన్న ఉద్దేశంతోనే యువగళం పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. తాను పాదయాత్ర ప్రారంభించిన 45 రోజులకే యువగళం ఆంధ్ర గళం అయిందని అన్నారు.
"పాదయాత్రలో ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకున్నాను. ప్రజలను కలిసి స్వయంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నాను. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను ఎప్పుడూ వేధింపులకు గురిచేయలేదు. జగన్ పాలనలో బీసీలు, మైనారిటీలపై దాడులు పెరిగాయి. అరాచక పాలన పోవాలంటే టీడీపీకి ఓటు వేయాలి. సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ అమలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రోజుకో హామీ ఇస్తే జగన్ లా పరదాలు కట్టుకుని తిరగాలి" అని వ్యాఖ్యానించారు.