Payyavula Keshav: పయ్యావుల కేశవ్ అరెస్ట్... తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు
- రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్న పయ్యావుల
- పయ్యావుల అరెస్ట్ సందర్భంగా ఉద్రిక్తత
- కనేకల్ పీఎస్ కు తరలింపు!
టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ను ఉరవకొండలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ గుంతకల్లు బ్రాంచి కెనాల్ రైతులతో సమావేశం నిర్వహించిన పయ్యావుల అనంతరం వారితో కలిసి బళ్లారి-అనంతపురం రోడ్డుపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు.
గుంతకల్లు బ్రాంచి కాలువ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందంటూ ఆయన రైతులతో కలిసి నిరసనకు దిగారు. కాలువ నిండా నీరు ప్రవహిస్తున్నా, ఇక్కడి రైతులకు ఒక్క పర్యాయం నీరు అందించలేరా అని పయ్యావుల ప్రశ్నించారు. హంద్రీ-నీవా నీరు వృథాగా పోతుంటే రైతులకు కడుపు మండిపోతోందని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. గుంతకల్లు బ్రాంచి కెనాల్ కు నీరు నిలిపివేయడం వల్ల 30 వేల ఎకరాల్లో, రూ.300 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో, పోలీసులు పయ్యావుల కేశవ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఆయనను కనేకల్ పీఎస్ కు తరలించినట్టు తెలుస్తోంది. పయ్యావులను అరెస్ట్ చేసిన సమయంలో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పయ్యావులను అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. రైతులు తీవ్రంగా ప్రతిఘటించడమే అందుకు కారణం.