Nara Lokesh: కుప్పం నుంచి విశాఖ వరకు... నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గణాంకాలు ఇవిగో!
- జనవరి 27న యువగళం ప్రారంభం
- 3,132 కిలోమీటర్లు నడిచిన లోకేశ్
- నిన్న విశాఖలో ముగిసిన పాదయాత్ర
- 226 రోజుల పాటు కొనసాగిన యువగళం
ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి ప్రారంభమైన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది.
తారకరత్న మరణం, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామం లేకుండా లోకేశ్ పాదయాత్ర సాగింది. రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం యువగళం ఆగలేదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షంలోనూ యాత్రను కొనసాగించారు.
పాదయాత్ర నంద్యాల చేరుకున్న సమయంలో అభిమానుల తాకిడికి చేయినొప్పితో బాధపడుతున్న సమయంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా లోకేశ్ ముందుకు సాగారు.
యువగళం పాదయాత్రలో లోకేశ్ 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా లోకేశ్ కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నారు.
1). చిత్తూరు – 14 నియోజకవర్గాలు – 45రోజులు – 577 కి.మీ.
2). అనంతపురం – 9 నియోజకవర్గాలు – 23రోజులు – 303 కి.మీ.
3). కర్నూలు – 14 నియోజకవర్గాలు – 40రోజులు – 507 కి.మీ.
4). కడప – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ.
5). నెల్లూరు – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.
6). ప్రకాశం – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ.
7). గుంటూరు – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 236 కి.మీ.
8). కృష్ణా జిల్లా – 6 నియోజకవర్గాలు – 8రోజులు – 113 కి.మీ.లు
9). పశ్చిమగోదావరి – 8 నియోజకవర్గాలు – 11రోజులు – 225.5 కి.మీ.
10). తూర్పుగోదావరి – 9 నియోజకవర్గాలు – 12రోజులు – 178.5 కి.మీ.
11). విశాఖపట్నం జిల్లా – 5 నియోజకవర్గాలు – 7రోజులు – 113 కి.మీ.
*మొత్తం – 97 నియోజకవర్గాలు – 226రోజులు – 3132 కి.మీ.