Jagan: సీఎం జగన్ ను కలిసిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు
- ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు
- నియోజకవర్గాల మార్పుతో నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సీఎం జగన్
- సీఎం క్యాంపు కార్యాలయానికి తరలి వస్తున్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రానుండగా, ప్రధాన పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. అధికార పక్షం వైసీపీ ఈసారి చాలా నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇటీవలే 11 నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చడం ద్వారా సీఎం జగన్ మిగతా నేతల్లో ఆందోళన రేకెత్తించారు.
ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ ను మంత్రులు గుమ్మనూరు జయరామ్, పినిపె విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ ను కలిసిన వారిలో రాజోలు జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఉన్నారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కూడా సీఎంతో భేటీ అయ్యారు.
ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, కొన్ని నియోజకవర్గాల్లో మార్పు, తదితర అంశాలపై సీఎం జగన్ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ నేతల అభిప్రాయాలు కూడా తెలుసుకుని ఇన్చార్జులను ఖరారు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఆయా ఎమ్మెల్యేలకు స్పష్టత నిస్తున్నారు.