Nizamabad District: మాక్లూర్ కుటుంబ సభ్యుల హత్య... ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం: ఎస్పీ సింధుశర్మ

SP Sindhu Sharma on Maklooru murder case

  • నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వరుస హత్యల ఘటన వివరాలు వెల్లడించిన ఎస్పీ 
  • ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ
  • నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ ఫోన్లు, రూ.30వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ వెల్లడించారు. పోలీసులు మంగళవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధుశర్మ చెబుతూ, నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ ఫోన్లు, రూ.30 వేల నగదు, భూరిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందన్నారు.

గత నెల 29న మాక్లూర్ మండలంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రసాద్‌ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడే మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రసాద్ జైల్లో ఉన్నాడని నమ్మబలికి ఈ నెల 1న ప్రసాద్ భార్య శాన్వికను తీసుకువెళ్లి గోదావరిలోకి తోసేశారని, అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని కూడా తీసుకెళ్లి మెదక్ జిల్లా వడియారం వద్ద తగులబెట్టారని వివరించారు. 

ఆ తర్వాత ప్రసాద్ వద్దకు వెళదామని చెప్పి అతని తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ తీసుకువెళ్లి... తొలుత నిజామాబాద్ లాడ్జిలో ఉంచారని, ఆ తర్వాత డిసెంబర్ 4న... ప్రశాంత్ ఆ పిల్లల్ని చంపేశాడని తెలిపారు. వారిని మెండోరా వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేసినట్లు తెలిపారు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను పెట్రోల్ పోసి తగులబెట్టారన్నారు. అయితే తమ కుటుంబ సభ్యులు ఎంతకూ రాకపోవడంతో ప్రసాద్ తల్లి లాడ్చి నుంచి పారిపోయి వచ్చి, పోలీసులను ఆశ్రయించిందని, ఆమె కోసం వచ్చిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయని, ప్రసాద్, అతని భార్య మృతదేహం దొరకలేదన్నారు.

  • Loading...

More Telugu News