Nara Lokesh: యువగళం ద్వారా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన నారా లోకేశ్
- ఏపీలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
- 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర పాదయాత్ర
- ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చిన లోకేశ్
- అమలు చేయకపోతే నిలదీయవచ్చని స్పష్టీకరణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నవ్యోత్సాహం పెల్లుబుకుతోంది. లోకేశ్ పాదయాత్ర ఆద్యంతం టీడీపీ శ్రేణలు కదం తొక్కాయి. నేతలు, కార్యకర్తల మద్దతుతో లోకేశ్ 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్రను కొద్ది సమయంలోనే పూర్తి చేశారు.
కాగా, యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాదయాత్ర సందర్భంగా ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ... తాము అధికారంలోకి వచ్చాక అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామో ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే ప్రజలు తమను నిలదీయవచ్చని చెప్పారు.
సెల్ఫీ ఛాలెంజ్ లతో నారా లోకేశ్ దూకుడు
యువగళం పాదయాత్ర దారిలో టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ లు విసిరారు. తమ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనుల వద్ద, వైసీపీ అభివృద్ధి పనుల్లో విఫలమైన చోట సెల్ఫీలు తీసుకున్న లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు - వైసీపీ పాలనలో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీలతో వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేశారు.
సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
పాదయాత్ర సందర్భంగా తాను బస చేసే ప్రాంతాల్లో తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేశ్ పేరుతో లోకేశ్ ప్రతి రోజు ఓ కార్యక్రమం నిర్వహించేవారు. ఈ కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభించింది. 226 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో లోకేశ్ 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో ఫోటోలు దిగారు.
నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500 మంది లోకేశ్ తో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమం కారణంగా నంద్యాల నియోజకవర్గంలో యాత్ర చేస్తున్న సమయంలో లోకేశ్ కు తీవ్రమైన భుజం నొప్పి వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించిన లోకేశ్ వినలేదు.
అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తనతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేశారు.
సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ నిరాశపర్చకుండా ఓపికగా ఫోటోలు దిగారు.