Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడి నుంచో తేల్చేసిన లోకేశ్

Nara Lokesh confirmed his contest from which seat in next elections

  • మంగళగిరి నుంచే పోటీకి దిగుతున్నట్టు చెప్పిన లోకేశ్
  • తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 217ను రద్దు చేస్తామన్న టీడీపీ నేత
  • 2014 మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామన్న లోకేశ్
  • నెల రోజుల్లోనే సీట్ల పంపకం ఓ కొలిక్కి వస్తుందని వ్యాఖ్య
  • జగన్‌ను సైకో అని తాము అనడం లేదని, ఆ మాట ప్రజలదన్న లోకేశ్

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల పొట్టకొడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో217ను రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. పద్ధతి ప్రకారం విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని, చెత్తపన్ను, వృత్తిపన్నులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం యువగళం క్యాంప్ సైట్ వద్దనున్న ఆయన ఈనాడు-ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఆ ఘనత టీడీపీదే
తాము అధికారంలోకి వచ్చాక చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్న ఆయన.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే మళ్లీ పరిశ్రమలను తీసుకొస్తామని, ఉద్యోగాలిస్తామని, రోడ్లకు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ.11 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు చెప్పారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం నెరవేర్చామని తెలిపారు. పేదల కోసం దాదాపు 120 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని స్పష్టం చేశారు. 

మంగళగిరి ఎమ్మెల్యే ఎక్కడున్నారో?
వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని, మంగళగిరి నుంచే మరోమారు బరిలోకి దిగబోతున్నట్టు చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదని, తన పాదయాత్ర పూర్తయ్యేసరికి ఆయన జంప్ అయిపోయారని ఎద్దేవా చేశారు. నిరుపేదల క్షేమం కోరేవారు ఎవరూ రూ. 2 వేల పెన్షన్‌ను రూ. 3 వేలు చేయడానికి ఐదేళ్లు ఆగరని విమర్శించారు. 8 సార్లు కరెంటు చార్జీలు, 3 సార్లు ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. విశాఖపట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

బీఆర్ఎస్ ఓటమికి కారణం నేను చెప్పను
 జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పునరుద్ధరిస్తారని ప్రజలకు తెలుసని లోకేశ్ పేర్కొన్నారు. అహంకారాన్ని ప్రజలు సహించబోరన్న విషయం ఇటీవలి ఎన్నికల్లో రుజువైందని, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏమిటనేది వ్యక్తిగతంతా తాను చెప్పలేనన్నారు. డబ్బుంటే రాజకీయం చేయవచ్చన్నది నిజం కాదని, తెలంగాణ ఎన్నికల్లో ఆ విషయం తేలిపోయిందని అన్నారు. అక్కడ ప్రతిపక్షం పెట్టిన ఖర్చుకు రెండుమూడింతలు అధికార పక్షం పెట్టినా ఫలితం లేకుండా పోయిందన్నారు. 

అది వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం
టీడీపీ అధికారంలోకి వస్తే అన్నింటినీ అమరావతికి తీసుకెళ్తారనేది వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తప్ప మరోటి  కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. బీసీలకు చంద్రబాబు అమలు చేసిన 34 శాతం రిజర్వేషన్‌లో వైసీపీ ప్రభుత్వం 10 శాతం కోతపెట్టిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక దానిని మళ్లీ సరిదిద్దుతామని చెప్పారు. వరుసగా ఓడిపోతున్న సీట్లను ప్రక్షాళన చేస్తామని, నెల రోజుల్లోనే సీట్ల పంపకం విషయం ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు. జగన్‌ను సైకో అని తాము అనడం లేదని, ప్రజలు అంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News