Mallu Bhatti Vikramarka: ఎన్నో ఆశలతో తెచ్చుకున్న తెలంగాణ కలలన్నీ కల్లలయ్యాయి: మల్లు భట్టి విక్రమార్క
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన మల్లు భట్టి విక్రమార్క
- రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేవన్న డిప్యూటీ సీఎం
- వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్య
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ శ్వేతపత్రంపై సభలో ఉన్న ప్రతి సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నానని చెప్పారు.