Telangana: మరోమూడు రోజులు చలి భరించాల్సిందే.. తెలంగాణవాసులకు వాతావరణ కేంద్రం హెచ్చరిక
- తెలంగాణలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
- కలవరపెడుతున్న చలిగాలులు
- ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో అత్యల్పంగా 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
- హైదరాబాద్‌లో 17.9 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు. చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో నిన్న అత్యల్పంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ చలి వణికిస్తోంది. దీనికి తోడుగా వీస్తున్న చలిగాలులు మరింత కంగారెత్తిస్తున్నాయి. నగరంలో నిన్న 17.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.