Harish Rao: 42 పేజీల నోట్ ఇచ్చి వెంటనే మాట్లాడమంటే ఎలా అధ్యక్షా?: హరీశ్ రావు
- ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన మల్లు భట్టి
- మాట్లాడేందుకు తొలుత హరీశ్ కు అవకాశం ఇచ్చిన స్పీకర్
- నోట్ చదవడానికి కొంత సమయం కావాలన్న హరీశ్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వెంటనే ఈ అంశంపై చర్చను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. మాట్లాడేందుకు తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు అవకాశం ఇచ్చారు. హరీశ్ రావు మాట్లాడుతూ... 42 పేజీల నోట్ ఇచ్చి 4 నిమిషాలు కూడా కాలేదు... దీన్ని చదవకుండా ఏం మాట్లాడాలి అధ్యక్షా? అని అన్నారు. నోట్ ను చదవడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... ఒక గంట సేపు టీ బ్రేక్ ఇస్తే నోట్ ను చదువుకుంటామని కోరారు. అలాగే సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సభకు అరగంట టీ బ్రేక్ ను స్పీకర్ ఇచ్చారు.