KTR: బీజేపీ పెద్ద తలకాయల్ని ఓడించింది మేమే: ఖర్గే తనయుడికి కేటీఆర్ కౌంటర్
- కేటీఆర్ కూడా బీజేపీని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందని ప్రియాంక్ ఖర్గే ఆరోపణ
- మీరు కూడా ఈ ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషమన్న కేటీఆర్
- సునీల్ అండ్ టీమ్ ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై ఎక్స్ వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం జరిగిన ట్వీట్ వార్‌లోకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే వచ్చారు. అబద్ధాలు, అవకతవకల విషయంలో కేటీఆర్ కూడా బీజేపీని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలుగా మారినందుకు ఇలాంటి అబద్దపు ప్రచారాలు వారికి నిత్యకృత్యంగా మారాయన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, వార్తలను తిప్పికొట్టడానికే కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయబోతోందంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 'హాయ్ ప్రియాంక్ గారు. మీరు కూడా ఈ ఇష్యూలో చేరాలని నిర్ణయించుకున్నందుకు సంతోషం. మీ నాయకుడు రాహుల్ గాంధీ కర్ణాటక యువతకు రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ప్రకటన, మీ డిప్యూటీ సీఎం ఖజానా ఖాళీగా ఉందని చేసిన ప్రకటనలు కూడా తప్పుడువేనా..? దోస్త్.. తెలంగాణలో ముగ్గురు ఎంపీలు సహా బీజేపీ పెద్ద తలకాయలను ఓడించింది మేమే. కాంగ్రెస్ కానే కాదు. సునీల్ అండ్ టీమ్ ప్రచారం పట్ల మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది' అని చురకలు అంటించారు.