Uttam Kumar Reddy: బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
- బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత బియ్యం మాత్రమే ఇచ్చాయన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులూ ఇచ్చిందని వ్యాఖ్య
- పౌర సరఫరాల శాఖకు బియ్యంపై రాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని విమర్శ
బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత బియ్యం మాత్రమే ఇచ్చాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూదా ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పౌర సరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉన్నట్లు తెలిపారు. పౌర సరఫరాల శాఖకు బియ్యంపై రాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని మండిపడ్డారు. ధాన్యం డబ్బులను కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదని విమర్శించారు.
పదేళ్లలో కాంగ్రెస్ అప్పులమయం: మదన్ మోహన్
పదేళ్లలో తెలంగాణను అప్పులమయం చేశారని, కేసీఆర్ హయాంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పారు... కానీ అందులో వాస్తవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. పేదల కోసం ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అప్పుల బారినపడి గ్రామాల్లో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. అసలు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేదన్నారు. తెలంగాణ ఎక్కడ నెంబర్ వన్ అయింది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 75 లక్షల కుటుంబాలు బీపీఎల్ కింద ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాలలో ఐటీ అభివృద్ధి జరిగినట్లే ఇక్కడా జరిగిందన్నారు. బీఆర్ఎస్ చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు.