Harish Rao: కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషయం అర్థం కావడానికి సమయం పడుతుంది: హరీశ్ రావు

Harish Rao suggestion to CM Revanth Reddy

  • కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలన్న హరీశ్ రావు
  • మీ విజ్ఞతతో సంపదను సమకూర్చుకోండి కానీ, బీఆర్ఎస్‌పై నెపం వేయవద్దని సూచన
  • రాష్ట్ర పరపతిని దిగజార్చవద్దని కోరిన హరీశ్ రావు

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని... నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొత్త ముఖ్యమంత్రికి విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందని చురక అంటించారు. కాళేశ్వరం కార్పోరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం ఆ ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయలేదని... పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామని స్పష్టం చేశారు. మీ విజ్ఞతతో సంపదను సమకూర్చుకోవాలని.. నెపం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టివేసి తప్పించుకోవద్దని సూచించారు. రాష్ట్ర పరపతిని దిగజార్చవద్దని, భవిష్యత్తును అంధకారం చేయవద్దని కోరారు. 

హరీశ్ రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 2014 నుంచి 2016 వరకు హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారని, ఆ తర్వాత కేసీఆర్ వద్ద ఆ శాఖ ఉందని గుర్తు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు వారి కుటుంబం తప్ప మరొకరు చేయలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు మాత్రమే కాదన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్‌కు రూ.97,449 కోట్లు, ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చు చేసిందన్నారు. కానీ హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

2014కు ముందు ప్రజలు మంచినీళ్లు తాగలేదా? మీ ప్రభుత్వం వచ్చాకే మంచినీళ్లు తాగినట్లుగా చెబుతున్నారేమిటి? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ వల్ల ఐదువేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి రుణాలు తెచ్చారని మండిపడ్డారు. అప్పులు చేసిన విషయం అంగీకరించకుండా దబాయిస్తున్నారన్నారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News