Nadendla Manohar: లోకేశ్ గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారో చెప్పిన నాదెండ్ల
- పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ
- హాజరైన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్
- నారా లోకేశ్ పై నాదెండ్ల అభినందనల వర్షం
టీడీపీ యువగళం నవశకం సభలో జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ ఆసక్తికర అంశం వెల్లడించారు. నారా లోకేశ్ టీడీపీ పార్టీ కోసం ఓ కార్యకర్తలా బలంగా నిలబడ్డారని, ఇది నారా లోకేశ్ ను హైలైట్ చేయాల్సిన సభ అని పవన్ కల్యాణ్ చెప్పినట్టు నాదెండ్ల తెలిపారు.
"ఈ సభ కోసం మాకు మొట్టమొదట ఆహ్వానం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ గారి అభిప్రాయం ఎలా ఉందంటే... లోకేశ్ గారి నాయకత్వాన్ని పెంచాలి, ఈ సభలో నారా లోకేశ్ ముఖ్య అతిథిలా ఉంటేనే సభకు తగిన గౌరవం దక్కుతుంది, ఆ సభకు మనం వెళ్లడం వల్ల ఆ ఉద్దేశానికి భంగం కలుగుతుంది అని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని నేను లోకేశ్ గారికి తెలియజేశాను. అయితే, నారా లోకేశ్ స్పందించే మనస్తత్వం చూశాక పవన్ కల్యాణ్ ఎంతో ముగ్ధులయ్యారు. లోకేశ్ గారు అన్న మాట ఏంటంటే... నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది. టీడీపీ, జనసేన కలిసి ఓ అద్భుత విజయం సాధించేందుకు నాందిగా ఏర్పాటు చేస్తున్న సభ అని చెప్పారు. ఇలాంటి సభకు పవన్ కల్యాణ్ గారు కచ్చితంగా రావాలి... పవన్ కల్యాణ్ గారు ముందుండి నడిచేలా అవసరమైతే నేనొక అడుగు వెనక్కి వేస్తాను అని లోకేశ్ గారు చెప్పారు. ఆ రోజు లోకేశ్ గారు వెలువరించిన నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ నాదెండ్ల కొనియాడారు.
3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేశ్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు నాదెండ్ల పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేశ్ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.